‘వెన్నుపోటుకు రెండేళ్లు’ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

‘వెన్నుపోటుకు రెండేళ్లు’ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కూటమి వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్దాం: దేవినేని అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ: రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టనున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దేవినేని అవినాష్ విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను దేవినేని అవినాష్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ, మండల స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8 లేదా 9న ఇండోర్ సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలను విజయవంతం చేయాలని దేవినేని అవినాష్ కోరారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అవినాష్ తెలిపారు. ప్రజల పక్షాన నిలిచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్లు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.