గొల్లపూడిలో రూ.5.04 లక్షల ఎల్‌ఓసీల అందజేత
గొల్లపూడిలో రూ.5.04 లక్షల ఎల్‌ఓసీల అందజేత
నలుగురు లబ్ధిదారులకు పంపిణీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుడి కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు ఎల్‌ఓసీలను అందజేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని నలుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.5,04,534 విలువైన ఎల్‌ఓసీలు మంజూరయ్యాయి. వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఈ ఎల్‌ఓసీలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా పంపిణీ చేశారు.
రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వకు చెందిన గుత్తి జమలమ్మకు రూ.1,25,000, ఇబ్రహీంపట్నానికి చెందిన పులి అరుణ కుమారికి రూ.1,29,709, గొల్లపూడికి చెందిన తమిరిసి విజయలక్ష్మికి రూ.75,016, రెడ్డిగూడెంకు చెందిన కట్ట సీతమ్మకు రూ.1,74,809 విలువైన ఎల్‌ఓసీలు మంజూరయ్యాయి. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆపదలో ఉన్నవారికి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్జీ పెట్టుకున్న వెంటనే ఎల్‌ఓసీలు మంజూరు చేయిస్తున్నామని వివరించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఎల్‌ఓసీలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
