డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి

డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి

  • ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
  • జిఎం కార్యాలయం ఎదుట ధర్నా, వినతి పత్రం అందజేత

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : సింగరేణిలో మెడికల్ ఆన్ ఫిట్ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట సింగరేణి వ్యాప్తంగా 400 మంది కార్మికులు డీపెండెంట్ ఉద్యోగాలు పొంది ఉన్న వారికి నియామక పత్రాలు అందజేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా వివిధ అనారోగ్య కారణాలవల్ల మెడికల్ అన్ఫిట్ పొందిన కార్మికుల పిల్లలకు సుమారు 400 మంది డిపెండెంట్ ఉద్యోగం పొంది ఉన్నారని వారికి ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యం నియామక పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు. వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఇల్లు గడవక దుర్భర జీవితాలు గడుపుతున్నారని అన్నారు. డిపెండెంట్ కార్మికులకు ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు అందించడంలో విఫలమైందని ఆరోపించారు.

సింగరేణి వ్యాప్తంగా 400 మంది నియామక పత్రాలకు కోసం ఎదురుచూస్తున్నారని అందులో ఒక్క భూపాలపల్లి ఏరియా నుండి సుమారు 70 మంది డిపెండెంట్ కార్మికులు ఉద్యోగంలో ఆన్ ఫీట్ అయి ఉన్నారని, సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి నియామక పత్రాలు అందజేయకపోవడం సరైనది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు. గతంలో సింగరేణి భవనకు పిలిపించుకొని నియామక పత్రాలు ఇచ్చేవారని జూన్ 2న కార్మికులకు ఉద్యోగం నియామక పత్రాలు అందజేస్తారని ఎదురు చూసిన కార్మికులకు నిరాశ ఎదురైందని చెప్పారు.

ఓపిక నశించి బుధవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే జూన్ నెలలో సమ్మె కైనా సిద్ధమేనని హెచ్చరించారు. అనంతరం డిపెండెంట్ లకు కార్మికుల కు నియమాక పత్రాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక జిఎం ఏ రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు ఆసిఫ్ పాషా, జి శ్రీనివాస్, కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ నూకల చంద్రమౌళి, బ్రాంచ్ కమిటీ నాయకులు తోట రామచందర్, ఫిట్ సెక్రటరీలు రాజేందర్, గణేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, సుమారు 200 మంది కార్మికులు పాల్గొన్నారు.