2047 నాటికి 50% హరిత విస్తీర్ణం లక్ష్యం..

40 లక్షల మొక్కల నాటకానికి భారీ కార్యాచరణ!

విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 2047 నాటికి హరిత విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచేందుకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టి హరిత లక్ష్య సాధనకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

మంగళవారం కలెక్టర్ వర్చువల్ విధానంలో అటవీ, డ్వామా, వ్యవసాయం, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల భూములు, వివిధ సంస్థల స్థలాలు, రహదారులు, రైల్వే మార్గాలు, కాలువల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రతి శాఖ తమ పరిధిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు.

మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల అమలును వేగవంతం చేసి, మొక్కల జీవన శాతాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో దాదాపు 40 లక్షల మొక్కలను సమీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కలెక్టర్, అందుకు అనుగుణంగా నర్సరీల సామర్థ్యాన్ని పెంచాలని, అవసరమైన మొక్కల రకాలను ముందుగానే గుర్తించాలని, సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సామూహిక ఉద్యమంగా మార్చాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి జి. సతీష్, డ్వామా పీడీ ఎ. రాము, డీపీవో పి. లావణ్యకుమారి, డీఈవో ఎల్. చంద్రకళ, ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.