ప్రత్యేక తెలంగాణ కళ… ఆరు దశాబ్దాల పోరాటం …

ప్రత్యేక తెలంగాణ కళ… ఆరు దశాబ్దాల పోరాటం …
- మహిళా శక్తి రైతుసేవ కేంద్రాలను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- కలెక్టర్ తో కలిసి బీర్లు ఐలయ్య ట్రైసైకిల్ అందించారు.
- సంక్షేమ ఫలాల ఫలితాల సందేశం
- ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల ఆకాంక్ష, ఆరు దశాబ్దాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న దేశంలోని 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.
మంగళవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి బీర్ల ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని దేశ, ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో “తెలంగాణ రైజింగ్–2047” విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

తెలంగాణ ఉద్యమానికి జనగామ గడ్డకు ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ, పోరాట యోధుడు సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్యతో పాటు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు.
పన్నెండు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, స్వేచ్ఛా భావాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. అమరవీరుల కలలు సాకారం కావాలంటే ప్రతి ఇంటికి వెలుగు, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి రైతుకు సాగునీరు, ప్రతి కష్టజీవికి న్యాయం అందాలని పేర్కొన్నారు.
ఈ లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు వివరించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 10 ప్రధాన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
99 రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ శాఖల ద్వారా అవగాహన సదస్సులు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
