అలా చేస్తే పట్టా పాస్‌బుక్ రద్దు చేస్తాం..

కుంటాల (ఆంధ్రప్రభ):పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి జొన్నలను విక్రయించడానికి తెలంగాణకు తరలిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కుంటాల తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ తీవ్రంగా హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా మహారాష్ట్ర ధాన్యాన్ని తెలంగాణకు తీసుకువచ్చి ఇక్కడి రైతుల పేర్లతో విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

క్రిమినల్ కేసులు & పాస్‌బుక్ రద్దు…
మహారాష్ట్ర ధాన్యాన్ని ఇక్కడ విక్రయించేందుకు సహకరించే స్థానిక రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, వారి పట్టా పాస్ బుక్‌లను సైతం రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సరిహద్దు దాటి ధాన్యం రాకుండా నిలువరించేందుకు దౌనెల్లి ప్రాంతంలో ప్రత్యేక చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

చెక్‌పోస్ట్ వద్ద 24 గంటలూ కఠిన పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని, నిఘా తీవ్రం చేశామని పేర్కొన్నారు.ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి జొన్నలను తెలంగాణకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఇబ్బందుల్లో పడవద్దని తాసిల్దార్ ఆడే కమల్ సింగ్ హెచ్చరించారు.

Leave a Reply