మక్తల్‌లో రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మక్తల్‌లో రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మక్తల్, ఆంధ్రప్రభ:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మక్తల్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుడు జి. నీలప్ప ముదిరాజ్ తెలిపారు.
జూన్ 2న ఉదయం 9 గంటలకు మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ల బాలకృష్ణ రెడ్డి, మక్తల్ మాజీ సర్పంచ్ కొత్త సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నీలప్ప ముదిరాజ్ పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ పతాకావిష్కరణ వేడుకల్లో తెలంగాణవాదులు, పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జి. నీలప్ప ముదిరాజ్ కోరారు.
