బషీరాబాద్‌లో మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ దాడి

బషీరాబాద్‌లో మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ దాడి
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్, సహజ వనరుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చీతా ఫోర్స్ బృందం ప్రత్యేక నిఘా చేపట్టింది సీసీఎస్ ఏసీపీ ఇన్‌చార్జి మస్తాన్ అలీ పర్యవేక్షణలో సోమవారం కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ శివారులో చీతా ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు.
కాడి చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మొరం తవ్వి తరలిస్తున్న కార్యకలాపాలను గుర్తించారు.తనిఖీల్లో మొరం తవ్వకాల కోసం వినియోగిస్తున్న ఒక జేసీబీ యంత్రంతో పాటు, మొరం రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.స్వాధీనం చేసుకున్న జేసీబీ, ఐదు ట్రాక్టర్లను తదుపరి విచారణ కోసం కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ మొరం, ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
బషీరాబాద్‌లో మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ దాడి
