పశ్చిమలో యోగాంధ్ర కార్యక్రమాలు

పశ్చిమలో యోగాంధ్ర కార్యక్రమాలు

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగాంధ్ర-2026 కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో యోగాంధ్ర-2026 నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలని సూచించారు.

జూన్ 21న జిల్లా కేంద్రంలో వెయ్యి మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా సెషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అథ్లెటిక్స్ అండ్ స్పోర్ట్స్ గ్రూప్స్ థీమ్‌తో ప్రత్యేక యోగా ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 13న నరసాపురం వలందర్ రేవు ప్రాంగణంలో, జూన్ 14న పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో 500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న యోగా ట్రైనర్లతో పాటు మరింత మందికి శిక్షణ ఇచ్చి యోగా శిక్షకులుగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు తదితర ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలకు రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రజలు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పర్యాటక, క్రీడా, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.