పోలీస్ పీజీఆర్ఎస్‌కు 63 అర్జీలు స్వీకరణ

సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశం

తిరుపతి, ఆంధ్రప్రభ: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 63 అర్జీలు స్వీకరించారు.

బాధితులు తమ సమస్యలను వివరించగా, అధికారులు వాటిని ఓర్పుగా విని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ఫిర్యాదులపై త్వరితగతిన న్యాయం అందించడం, పారదర్శకంగా పరిష్కారం చూపడమే పీజీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి పిటిషన్‌ను వెంటనే సంబంధిత విభాగాలకు పంపించి ప్రాధాన్యత ఆధారంగా విచారణ జరిపి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

అలాగే ఫిర్యాదుదారులకు వారి వినతులపై అవగాహన కల్పిస్తూ సానుకూల దృక్పథంతో స్పందించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రావి మనోహరచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.

Leave a Reply