పేదల సొంతింటి కల సాకారం ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యం

పేదల సొంతింటి కల సాకారం ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యం
- రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను, గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
