ఏపీలో అరాచక పాలన నడుస్తోంది
- ఏడుకొండలది ముమ్మాటికీ సర్కార్ హత్యే
- చంద్రబాబు నేతృత్వంలో అకృత్యాలకు అడ్డాగా మారుతున్న ఏపీ
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజం
నెల్లూరు, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ అరాచకాలకు, పోలీసుల లాకప్ హత్యలకు మారుపేరుగా మారిందని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మనుబోలు లాకప్ డెత్, బుచ్చిరెడ్డిపాలెం ఏఓ శ్రీహరి హత్య ఉదంతాలే ఇందుకు సజీవ సాక్ష్యాలని అన్నారు. పోలీసుల వైఫల్యాలు, అధికార పార్టీ నేతల ప్రమేయంపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
బాధ్యులైన అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ముమ్మాటికీ ‘సర్కారీ హత్యే’
మనుబోలు పోలీస్ స్టేషన్‌లో నిందితుడు ఏడుకొండలు మృతి చెందిన ఘటన ముమ్మాటికీ లాకప్ డెత్‌నేనని వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, నిందితుడు స్టేషన్‌లోనే లేడని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నది అసత్యమని విమర్శించారు.
శనివారం, ఆదివారం (11, 12 తేదీల్లో) ఏడుకొండలు, రియాజ్, ప్రసాద్‌లను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆయన ఆరోపించారు. ఆదివారం సాయంత్రం వారిని వదిలిపెట్టినప్పటికీ, సోమవారం రియాజ్, ప్రసాద్‌లు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని తెలిపారు. 13, 14 తేదీల్లో వారు స్టేషన్‌లో లేరని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో, ఆ తేదీలకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
మృతి చెందడానికి ముందు ఏడుకొండలు తన సోదరి ధనమ్మతో మాట్లాడుతూ.. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బలను తట్టుకోలేకపోతున్నానని చెప్పినట్లు కాకాణి పేర్కొన్నారు. పోస్టుమార్టానికి ముందు మృతదేహాన్ని పరిశీలించగా నోటి వద్ద నురగ కనిపించలేదని, అయితే శరీరంపై బురద మరకలు, కాళ్లు, వెనుక భాగంలో గాయాలు, కాలర్ బోన్ విరగడం, ఒక వేలు విరిగినట్లు గుర్తించానని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా మీడియా ముందు ప్రదర్శించారు.
సాక్ష్యాల తారుమారుపై ఆరోపణలు
జూలై 14 రాత్రి కానిస్టేబుల్ మాధవ్ మరో నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఉంచి, పోలీసులకు అనుకూలంగా వాంగ్మూలాలు రాయించుకుని సంతకాలు చేయించుకున్నారని కాకాణి ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఎస్‌ఐతో పాటు, పోలీసులకు సహకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్న టీడీపీ స్థానిక నాయకుడు సుధీర్, మృతుడి అక్క ధనమ్మతో జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని, వాటిని మీడియాకు వినిపించినట్లు తెలిపారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
ఏడుకొండల మృతికి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని కాకాణి డిమాండ్ చేశారు. అలాగే మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
బుచ్చిరెడ్డిపాలెం ఘటనపైనా ఆరోపణలు
బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేసిన శ్రీహరి అనుమానాస్పద మృతిపైనా కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శరీరంపై గాయాలున్నప్పటికీ, అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రూ.40 లక్షల లావాదేవీతో పోస్టుమార్టం చేయకుండా గుండెపోటుగా కేసును ముగించారని ఆరోపించారు.
