ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా

  • ఊట్కూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు సి. సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.

గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తతో సమన్వయంతో ముందుకు సాగుతానని చెప్పారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

మల్లెపల్లి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సూర్యప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెపల్లి కాంగ్రెస్ నాయకులు రాములు, కృష్ణంరాజు, శంకరప్ప, వెంకటప్ప, నర్సప్ప, శంకర్, తరుణ్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.