వానాకాలానికి సిద్ధమైన నర్సంపేట వ్యవసాయ శాఖ

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : వానాకాలం సాగుకు నర్సంపేట మండలంలోని రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వానాకాలంలో వివిధ పంటల సాగు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నర్సంపేట మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వానాకాలంలో సుమారు 11 వేల ఎకరాల్లో వరి, 7,500 ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 2,800 ఎకరాల్లో మిరప, 800 ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.

విత్తనాల నిల్వలు సిద్ధం

రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మండలంలో 45,650 పత్తి విత్తన ప్యాకెట్లు, 2.5 క్వింటాళ్ల మిరప విత్తనాలు, 450 క్వింటాళ్ల వరి విత్తనాలు, 300 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఎరువుల అవసరం–నిల్వల వివరాలు

వానాకాలం పంటల సాగుకు మొత్తం 3,350 మెట్రిక్ టన్నుల యూరియా, 850 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,250 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 650 మెట్రిక్ టన్నుల ఎంఓపీ అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ప్రస్తుతం మండలంలో 380 మెట్రిక్ టన్నుల యూరియా, 180 మెట్రిక్ టన్నుల డీఏపీ, 320 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 75 మెట్రిక్ టన్నుల ఎంఓపీ నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

రైతులకు సూచనలు

ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, ఎరువులను అధికారిక విక్రయ కేంద్రాల నుంచే తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వానాకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ కోరింది.

Leave a Reply