త్వరలో అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు

- 2వ వార్డులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా కింద కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని, త్వరలోనే వాటి మంజూరు ప్రక్రియ చేపడతామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు.
సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 2వ వార్డు మురకంబట్టలో పిళ్లయార్ గుడి వద్ద నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాలను అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఎస్. మనోహర్ నివాసానికి వెళ్లి రూ.6 వేల పింఛన్ మొత్తాన్ని అందజేసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ములను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు.
స్పాంజ్ కేటగిరీ కింద ప్రతి నెలా కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, రాజేష్ కుమార్ రెడ్డి, సురేంద్ర కుమార్తో పాటు స్థానిక కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
