ప్రశాంతంగా జరిగిన కీలక పరీక్ష..

ప్రశాంతంగా జరిగిన కీలక పరీక్ష..
కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఏర్పాట్లు..
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతిలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు–2026 ప్రశాంత వాతావరణంలో జరిగాయి.
పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం, శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించారు. అభ్యర్థులకు తాగునీరు, కూర్చునే సదుపాయాలు, సహాయక సిబ్బంది అందుబాటులో ఉన్న విషయాలను నిర్ధారించారు.

పరీక్ష హాళ్లలో నిబంధనలు, ఇన్విజిలేషన్ విధానం అమలును పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సమయపాలనతో, నియమావళి ప్రకారం నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

మధ్యాహ్నం నిర్వహించనున్న రెండో పేపర్‌కు సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
