ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోటుమర్ల వంక..

ధర్మవరం–పుట్టపర్తి రహదారిపై రాకపోకలకు అంతరాయం!

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలోని ధర్మవరం మండల పరిధిలో ఉన్న మోటుమర్ల వంక రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా సోమవారం ఉదయం ఉద్ధృతంగా ప్రవహించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో వంకలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

దీంతో వంకపై ఉన్న ప్రధాన రహదారిపై వరదనీరు పారుతుండటంతో ధర్మవరం–పుట్టపర్తి మార్గంలో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వంక ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదనీరు తగ్గే వరకు రహదారిపై ప్రయాణాలు చేయవద్దని వాహనదారులకు సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, చిన్న వాహనాల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.

మరోవైపు, మోటుమర్ల వంకలో నీరు పరవళ్లు తొక్కుతుండటంతో స్థానిక రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి.

వంకలో ప్రవహిస్తున్న నీరు చెరువులు, కుంటలు, భూగర్భ జల వనరులకు చేరి సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

ప్రాంత ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో వంక వద్దకు చేరుకుని వరద ప్రవాహాన్ని వీక్షించారు. అయితే వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రస్తుతం వంకలో నీటి ప్రవాహం కొనసాగుతుండగా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.