సగౌరవంగా ఎదగాలంటే చదువే మార్గం
సగౌరవంగా ఎదగాలంటే చదువే మార్గం
- వంగూరి ఆనందరావు మాదిగ
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ:
నేటి సమాజంలో సామాజికంగా సగౌరవంగా ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని ఎంఎస్పీ–ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు, వరంగల్ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు మాదిగ అన్నారు.గో-టు-విలేజ్ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మండలంలోని రామారాం గ్రామంలో గ్రామ పెద్దలు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కొడాలి రవి మాదిగ అధ్యక్షతన గ్రామ అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగూరి ఆనందరావు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశ్రీ పురస్కార గ్రహీత, సామాజిక ఉద్యమాల రథసారథి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన నిరంతర పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు.వర్గీకరణ ద్వారా మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలకు లభించిన రిజర్వేషన్ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధించిన అవకాశాలు నిజమైన ఫలితాలను ఇవ్వాలంటే విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని అన్నారు.
చదువును మధ్యలో నిలిపివేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విద్యను కొనసాగిస్తేనే సాధించిన హక్కులకు సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు.మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పర్యటనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవగాహన సదస్సుల ద్వారా ప్రజలకు హక్కులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రతి కుటుంబం నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని వంగూరి ఆనందరావు మాదిగ కోరారు.ఈ కార్యక్రమంలో మాదిగ విద్యార్థి సమాఖ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు చింతం సిద్ధూ మాదిగ, కొడాలి రవి మాదిగ, ఆరెపల్లి రాజేంద్ర మాదిగ, సాంబయ్య మాదిగ, ఈరెల్లి చేరాలు మాదిగ, ఈరెల్లి స్వామి మాదిగ, కొడాలి రాంబాబు మాదిగ, ఈరెల్లి శారద, ఈరెల్లి కవిత, సమ్మక్క, జ్యోతి, రాధిక, ప్రసన్న, మందకృష్ణ స్వామి, తిరుపతి, కొడాలి మోడీ, శనిగరం సురేష్, తనుగుల మురళి తదితరులు పాల్గొన్నారు.
