యువతకు శక్తివంతమైన సందేశం ఇచ్చిన ఐజీపీ రవికృష్ణ
యువతకు శక్తివంతమైన సందేశం ఇచ్చిన ఐజీపీ రవికృష్ణ
డ్రగ్స్‌కు దూరంగా… క్రీడలకు దగ్గరగా ఉండాలి..
ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఐజీపీ ఆకే రవికృష్ణ పిలుపు
మంగళగిరి, ఆంధ్రప్రభ: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. “డ్రగ్స్ వద్దు బ్రో – క్రికెట్ ఆడు బ్రో” అనే సందేశంతో ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ (ఎఫ్‌పీఎల్) సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
తాడేపల్లి టౌన్ పరిధిలోని బ్రహ్మానందపురం స్కూల్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ముబిన్ సీసీ జట్టు విజేతగా నిలిచింది. మొత్తం 50 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని ఐజీపీ రవికృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు యువతను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు నడిపించేందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఈగల్ పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు పరిమితమవకుండా శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది విద్యార్థులను మాదకద్రవ్యాల ప్రభావం నుంచి రక్షించేందుకు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రగ్స్, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అలాగే ఆపరేషన్ వజ్రప్రహార్ కింద రాష్ట్రంలో 849 గంజాయి హాట్స్పాట్లను గుర్తించి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైళ్ల ద్వారా డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ పేరుతో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ల సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం, పోలీసులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, యువత కలిసి పనిచేస్తేనే మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నాగేశ్ బాబు మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకట్రావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, డీఎస్పీ శాంతరాజ్ తదితరులు పాల్గొన్నారు.
