may31Sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may31Sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may31Sunday2026
may31Sunday2026

may31Sunday2026 | అభివృద్ధి పేరిట ప్రకృతిపై పెరుగుతున్న దాడి
వాతావరణ మార్పులు.. మానవాళికి ముప్పు
పర్యావరణ పరిరక్షణ ఒక్కరి బాధ్యత కాదు
చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు నాంది
భూమిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం

may31Sunday2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒకపక్క యుద్ధాల వల్ల జరుగుతోన్న విధ్వంసం.. మరోపక్క నగరీకరణ పేరుతో అంతరిస్తోన్న అడవులు… మరోవైపు పారిశ్రామికీకరణతో పెరుగుతున్న వాయు కాలుష్యం… ఆధునిక జీవన విధానం పేరుతో పెరుగుతున్న వాహనాల వినియోగం, వాటి నుంచి వెలువడుతున్న విషవాయువులు… మన స్వార్థం కోసం నాశనం చేస్తోన్న కొన్ని జంతు, పక్షి జలచర జీవరాశులు…ఇవన్నీ కలిసి ప్రపంచ పర్యావరణానికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదు.

మానవజాతి మేల్కొనడానికి ఇదే సరైన సమయం. ఏడాదిలో ఒకరోజు ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ పేరుతో హడావుడి చేయడం, వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం, మొక్కలు నాటి ఫొటోలు దిగడం మాత్రమే సరిపోదు. ప్రతిరోజూ… ప్రతి నిమిషం మనం చేసే ప్రతి పనీ భూమాతపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రకృతికి హాని కలిగించే అలవాట్లను వదిలి, వాటికి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. వాటిని ఆచరణలో పెట్టాలి.

ఎందుకంటే ప్రకృతి చేసే ప్రమాద హెచ్చరికలు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వేడి తరంగాలు, కరవులు, వరదలు, తుఫానులు, అటవీ అగ్ని ప్రమాదాలు… ఇవన్నీ ఎక్కడో ఒక చోట సంభవిస్తోన్న ప్రమాదాలు మాత్రమే కావు. వీటి ప్రభావం పుడమికి ముంచుకొస్తున్న ప్రమాద సంకేతాలు.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచ కాలుష్య నియంత్రణ మండలి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా వాతావరణ మార్పుల ప్రభావంపై పదేపదే హెచ్చరిస్తున్నాయి.

మనకు ఆక్సిజన్ అందించే చెట్లను నరికేస్తూ, ప్లాస్టిక్‌తో నేలను కలుషితం చేస్తూ, నీటి వనరులను నిర్లక్ష్యంగా వాడుకుంటూ, విద్యుత్‌ను వృథా చేస్తూ ఉంటే రాబోయే తరాలకు మనం ఏమి మిగులుస్తాం? అభివృద్ధి అవసరమే. కానీ ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి కాదు. ప్రకృతితో కలిసి నడిచే అభివృద్ధి కావాలి.

పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడి కర్తవ్యం కూడా. ఒక మొక్క నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించడం, చెత్తను సక్రమంగా నిర్వహించడం వంటి చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పులకు దారి తీస్తాయి.

మనకు మరో భూమి లేదు. మనం నివసిస్తున్న ఈ భూమే మన భవిష్యత్తు. అందుకే పర్యావరణ పరిరక్షణను ఒక రోజు కార్యక్రమంగా కాకుండా జీవిత విధానంగా మార్చుకోవాలి. మన కోసం కాదు… మన పిల్లల కోసం కాదు… ఈ భూమిపై జీవించే ప్రతి జీవి కోసం. నేడు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి ప్రపంచాన్ని నిర్ణయిస్తాయి. భూమాత మనల్ని కాపాడింది… ఇక ఆమెను కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ.

(జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..)

గెలుపు బాటలో… ఓటమి పాఠం!

విక్రమపురం రాజు విక్రమసేనుడు పెరుగుతున్న అవసరాలకు సరిపడా  సిబ్బందిని పెంచుకోవాలని ప్రతిభావంతుల ఎన్నిక కోసం ప్రకటన చేయించాడు.

మాధవుడు అనే పేద యువకుడు తన ప్రతిభ  ద్వారా రాచకొలువులో స్థానం సంపాదించాలని  ఆశపడ్డాడు. రాత్రింబవళ్లు సాధన చేసి కోటలో జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి రాజుగారి కొలువులో మంచి పదవి దక్కించుకుని కన్నవారి రుణం తీర్చుకోవాలని మాధవుడి తపన.

ఫలితాలు రానే వచ్చాయి. కాని మాధవుడు ఎన్నిక కాలేదు. రాజకోటలో జరిగిన గూడుపుఠాణీకి  మాధవుడి వంటి ప్రతిభావంతులు ఎందరో బలి అయ్యారు.

ప్రతిభకు న్యాయం జరగని మాయదారి లోకంలో ఇక బ్రతికి ఉండి లాభం  లేదని  నిశ్చయించుకున్నాడు  మాధవుడు.  నగరం  చివర ఉన్న కొండపై నుంచి దూకి ప్రాణం తీసుకోవాలని బయలుదేరాడు.

ఏడుస్తూ కొండపైకి  ఎక్కే  మాధవుడిని అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు గమనించాడు.    “ఆగు నాయనా! ఎక్కడికి వెళ్తున్నావు?” అని అతని దారికి అడ్డు నిలబడ్డాడు.

మాధవుడు తన బాధనంతా ఆ వృద్ధుడి ముందు వెళ్లబోసుకుంటూ “నా శ్రమకు ఫలితం దక్కలేదు. ఈ ఓటమిని నేను తట్టుకోలేను, నా జీవితం ఇక్కడితో అంతమైపోపాలి ” అని భోరుమని ఏడ్చేశాడు.

ముసలివాడు నవ్వి, పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని, దాని పక్కనే మొలుస్తున్న ఒక చిన్న మొక్కను చూపించి అన్నాడు, “చూడు నాయనా, ఈ బండరాయి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే పడి ఉంది. ఎండకు ఎండినా, వానకు తడిసినా దీనిలో  ఏ మార్పూ లేదు. దీనికి ప్రాణం లేదు, అనుభవం లేదు. కానీ ఈ చిన్న మొక్కను చూడు… విత్తనంగా ఉన్నప్పుడు భూమి చీకట్లోకి నెట్టబడింది. ఎదుగుతున్న దశలో  ఎన్నో రాళ్లు దాన్ని  అణగ దొక్కాలని చూశాయి. అయినా అది ఓడిపోలేదు. జాడదలుచుకోలేదు. కాబట్టే ప్రతి అవరోధాన్ని ఒక అనుభవంగా మార్చుకుని, భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చి ఈ రోజు ఒక అందమైన మొక్కగా కనువిందు చేస్తోంది.

వ్యవస్థలోని  లోపం వల్ల ఓడిపోతే అది  నీ తప్పు కాదు. చేయని తప్పుకు నిన్ను నీవు శిక్షించుకోవటం సరి  కాదు.  నీ బాధను  నీ కన్నవారి కడుపు కోతగా మారుస్తావా? నీ ప్రతిభ  నీ దగ్గరే  ఉంది. నీ అవకాశాలను దెబ్బ తీసిన వాళ్ళు నీ ప్రజ్ఞను దెబ్బతీయలేరు.

ఓడటం అంటే గెలుపు వైపు ఓ అడుగు వేయటం. గెలుపు ఆనందాన్ని ఇస్తే, ఓటమి గెలవటానికి ఒక అవకాశం ఇస్తుంది. 

భవిష్యత్తులో ఎలా గెలవాలో నేర్పే ‘అనుభవాన్ని’ ఇస్తుంది.”

మాధవుడు తన తప్పును తెలుసుకుని, ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నాడు.

కోటలో జరిగిన గూడుపుఠాణి బైటపడటంతో దోషులను శిక్షించి మరోసారి కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాడు  రాజు విక్రమసేనుడు. సహజంగానే ప్రజ్ఞాశాలి అయిన మాధవుడు ప్రధమ శ్రేణిలో నిలిచి రాజుగారి కొలువులో మంచి ఉద్యోగం సాధించాడు.

ఎదిగే క్రమంలో ఎదురుదెబ్బలు తగలటం  సహజమే. అలాగని నిరాశతో ప్రాణాలు తీసుకొంటే గెలుపు కోట తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లే!

సమస్య ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం ఎప్పటికీ పరిష్కారం కాదు. నిరాశకు లోనవకుండా ఆత్మ విశ్వాసంతో నిరంతరం శ్రమించేవాడిని విజయలక్ష్మి ఎప్పటికైనా వరించక తప్పదు.

అన్నీ కావాలి అంటే ఎలా ?

జీవితంలో మనకు అన్నీ కావాలి అనిపిస్తుంది.అన్ని చోట్లా ఎదగాలి అనిపిస్తుంది. అయితే ఉన్న ఈ ఒక్క జీవితంలో అవన్నీ సాధించడం కుదిరే పనేనా ? అన్న సందేహం నాకు కలుగుతుంది. ఎందుకంటే ఒకటి సాధించడానికే బోలెడంత సమయం పడుతుంది. మరి అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్ళాలంటే ఇంకెంత సమయం కావాలి. ఉన్న సమయం అంతా ఇలా ఏదో ఒకటి సాధించడానికే సరిపోతే మరి మనం జీవించేది ఎప్పుడు? కుటుంబాన్ని చూసుకునేది ఎప్పుడు??


మన చుట్టూ ఉన్న చాలా మంది ఒక రంగంలో ఎదగడం కోసం కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. అది తమ వృత్తి అయితే , దానిమీద మన జీవనం సాగుతుంటే అందులో ఎటువంటి తప్పు లేదు.కానీ అది మన ప్రవృత్తి అయినప్పుడు మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అలా అని మన ఆశలను , కోరికలను చంపుకోవాలా ? కానే కాదు. వృత్తి కి కుటుంబానికి సమయం కేటాయించగా మిగిలిన మన సమయంలో ఆ కృషి చెయ్యాలి. అప్పుడే ఆ రంగంలో ఆరోగ్యంగా ఎదుగుతాం.అలా కాక గబ గబా ఎదిగిపోవాలి అని అత్యాశ పడితే ఎటూ కాకుండా పోతాం.మన అయిన వాళ్ళకి విషాదాన్ని మిగుల్చుతాం.


అందుకే …అన్నీ కావాలి అనుకోవడం , అత్యాశకు లోనవడం మానసిక ప్రశాంతతను దూరం చేస్తే , ఉన్నంతలో కృషి చెయ్యడం నిదానించి ముందుకు వెళ్లడం మంచి సంతృప్తిని ఇస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆనందాన్ని పంచుతుంది.అంతే కదా ఫ్రెండ్స్ !!!

++++++++++++++++++++++++++++++++

తాత్వికత, ఆచరణ

Action without philosophy is a lethal weapon; philosophy without action is worthless – Soichiro Honda,
“Success represents the 1% of your work which result from the 99% that is called failure”

పై రెండు వాక్యాలు Soichiro Honda చెప్పాడు. అతను Japanese Legendary engineer, entrepreneur and industrialist. Honda motor co.ltd founder. ఎంతో గొప్ప వ్యక్తి. ఒక చిన్న షెడ్ లో తన జీవితం మొదలు పెట్టి జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగాడు.

ఈరోజు మనం వాడుతున్న Honda bike, car తన మేధస్సు నుంచి ఉద్భవించి పరిణామం చెంది ప్రపంచ మార్కెట్ లో ఒక నమ్మకంతో ఈరోజుకీ ఉన్నాయి.

మనకు గొప్ప ఆలోచనలు ఉంటే సరిపోవు. అవి ఆచరణలో పెట్టాలి.

కొందరు ఎంతో అద్భుతంగా తాత్విక ఆలోచనలు చెబుతారు. కానీ అవి ఎలా ఆచరణలో పెట్టాలో వారికే తెలీవు.

తమ సొంత జీవితంలో కనీస ఆచరణ లేకుండా సొల్లు చెబితే సరిపోదు. నీ ఆలోచనలు నిన్ను ముందు అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలి. లేదంటే అవే ఆలోచనలు మరణాయుధాలుగా మారి నిన్నే నాశనం చేస్తాయి! ఈ వాస్తవ ప్రపంచం మిమ్మల్ని, లేదా మనల్ని పిచ్చి వాళ్ళుగా జమ కడుతుంది. వెనుక నుంచి నవ్వు కుంటుంది. మీమీద మీ వెనుక పిచ్చి జోకులు వేసి నవ్వుతుంది.

ప్రపంచం మనతో చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. మన ఆలోచనలు, సిద్ధాంతాలు కూడా మానిటైజ్ (Monetize) కావాలి. అంటే ముందు నువ్వు డబ్బులు సంపాదించాలి.

End of the day success always counts only in terms of money. ఈ పచ్చి నిజం మనకు జీర్ణం కాదు! నువ్వు గొప్ప కళాకారుడివా? అయితే నెలకు ఎంత సంపాదిస్తున్నావు? నటుడివా? అయితే ఎంత నీ విలువ? డబ్బులో? కార్టూనిస్ట్? Ok fine. లేదా Singer ?! రచయిత?! కవి? మార్కెట్ లో వేర్ కార్టూనిస్ట్ లు కంటే ఎక్కువ సంపాదిస్తున్నావా? సమాజం ఇదే చూస్తుంది! సమాజం, కాలం పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, పక్కింటి వాళ్ళు, నీ ఊరు వాళ్ళు అందరూ నిన్ను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు! వారి తీర్పు, పరీక్ష చాలా సింపుల్ గా ఉంటాయి. నువ్వు వాడే కారు ఎంత? ఊళ్లో ఎంత పొలం కొన్నావు? ఎన్ని స్థలాలు? ఎంత పెద్ద ఇల్లు ఊళ్ళో ఉంది? నువ్వు ఉన్న సిటీలో ఉంది? హైదరాబాద్ అయితే హైదరాబాద్, బొంబాయి అయితే బొంబాయి, లేదా కలకత్తా!

నువ్వు వాడే బట్టలు, కళ్ళజోడు, కాళ్ళ జోడు, బంగారం , నీ కున్న పెద్ద పరిచయాలు…., అన్నీ నీ సక్సెస్ కి కొలబద్దలు!

ఇవన్నీ లైట్, నా మనసులో నేను గొప్పవాన్ని అనుకుంటారు కొందరు! కానీ అనుకుంటే కుదరదు! అంతరాత్మకు అన్నీ తెలుసు.

ఒక పార్టీకి వెళ్ళావు. నీకు ఇచ్చే విలువ ఈ భౌతిక ప్రపంచం…! నవ్వు కుంటున్నారా? వద్దు బ్రదర్! నిజాలు ఇంత చేదుగా ఉంటాయి!

ఈ కమర్షియల్ ప్రపంచంలో లెక్కలు చాలా దారుణంగా ఉంటాయి! కొందరు అడ్డదారుల్లో ఎదుగుతారు. కొందరు మెట్లు ఎక్కకుండా లిఫ్ట్ లో ఇరవై అంతస్తులు ఎక్కి తొంతరగా విజయం సాధించి క్రింద ఆశగా, భయంగా చూసే జనానికి చేయి ఊపుతారు!

తర్వాత వారు చెప్పే సోది కూడా వేదాంతంలా జనం వింటారు! లాజిక్స్ వెదకరు. డబ్బు, విజయం ఉంటే ఆ మెరుపులో అంతా బంగారంలా వినిపిస్తుంది. ఎప్పుడు సంపద కలిగిన, అప్పుడు బంధువులు వత్తురు…., అప్పుడు నువ్వు పెద్ద తప్పు చేసినా నిన్ను రక్షించే వ్యవస్థ నీకు ఒక కవచంలా కాపాడుతుంది! అర్రే తప్పు కదా అంటే.., కలియుగం ఇప్పుడు వాస్తవం అదే! కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు చిన్నోడు, తప్పు జరిగింది అంటున్నారు, అసలు నిజాలు ఇంకా బయటకు రావాలి! అదే సామాన్యుడు అయితే పరిస్తితి వేరేలా ఉండేది, అలాగే సిన్మా యాక్టర్ NTR కొడుకు బాలకృష్ణ తుపాకీ కాల్పులు…, అది వేరే వాళ్ళు చేస్తే వేరేలా ఉంటుంది! ఎన్నో వేల మంది జైళ్లలో ఉంటూ, ఛార్జ్ షీట్ ఫైల్ కాకుండా, సరైన న్యాయ సహాయం లేక, స్నేహితులు, బంధువులు లేక, ఏం చేయాలో తెలీక జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఎందరో!

అసలు తప్పు చేశారో లేదో నిర్ధారణ కాకుండా, నెలలు, కొందరు సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు! పేదవారు! “అంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కుండలు, శ్మశానమున శశి కాంతులలో చలి బారిన వెలి రాబండలు” అన్నాడు మహాకవి.

సమాజం పట్టించుకోదు! కనీసం మీడియా, జర్నలిజం, ఎవ్వరూ అటువైపు చూడరు. జైలు అంతే. తప్పు చేశారు అని నిర్ధారణకు వచ్చేస్తాం! అయ్యో!

అరుణాచలం గిరి ప్రదక్షిణ, పున్నెం , పుణ్యం వస్తుంది అంటే పదకొండు కిలోమీటర్లు దొర్లి పడేస్తారు. సుఖం, స్వర్గం shortcut లో దొరుకుతుంది అంటే చాలు, తిరుమల మాడవీధులు వీధులు నిండా పొర్లు దండాలు, మన కుటుంబ మహిళలే! మానవ సేవ మాధవ సేవ!

నిజంగా కష్టాల్లో ఉన్నవారివైపు మనం మన అక్షరాలు నిలబడాలి! అలాగే మన తెలివి, ఆలోచనలు, తాత్వికత, ముందు మన జీవితాలు బాగు చేయాలి! అది ఆచరణలో కనిపించాలి! వినిపించాలి! నువ్వు ఎదిగి, వేరే వారికి చేయి అందిస్తే అది నిజమైన గొప్ప విజయం. ఓం సర్వేషాం స్వస్తిర్చవతి!

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

తిరుమలేశుని దివ్య ప్రసాదాల చరిత్ర

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి విశ్వాసాలతో ఎందరో రాజులు, చక్రవర్తులు ఆలయ అభివృద్ధి తో పాటు రకరకాల ప్రసాదాల తయారీకోసమే ఎన్నో గ్రామాలను, ఎంతో వ్యవసాయ భూములను దాన శాసనాలతో సమర్పించిన ఘనత తిరుమలక్షేత్ర చరిత్రలోనే కనిపిస్తుంది.


శతాబ్దాల క్రితం దుర్గమమైన అడవుల మధ్య ఉన్న తిరుమలేశుని ఆలయంలో ప్రసాదాలు తయారు చేసి నివేదించే వ్యవస్థ ఉండేది కాదు. అదే విధంగా దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమలలో ఆకలి తీర్చే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. కనుక మార్గమధ్యంలో ఇప్పటి తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కూటముల ద్వారా తిరుప్పొంగం అనే పేరుతో ప్రసాదాలను తయారు చేసి స్వామికి నివేదించి భక్తులకు వితరణ చేసేవారు.

కాలక్రమంలో ఆయా రాజవంశాల దాన శాసనాల తో రకరకాల అన్నప్రసాదాల నివేదన మొదలైంది వాటితో పాటు 1414 లో సుఖీయం, 1415 లో అప్పం, 1461 లో వడ 1469 లో అత్తిరసం పేరుతో ప్రత్యేక ప్రసాదాల నైవేద్యాల సమర్పణలు మొదలయ్యాయి. ఆ రోజుల్లో ఎక్కువ రోజులు నిల్వవుండే వడ లకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రసాదాన్ని అందించాలనే ఆలోచనలో నుంచి 1800 – 1810 మధ్యకాలంలో శెనగ పిండి, బెల్లం పాకంతో కలిపి తయారు చేసిన బూందీ ని స్వామి కి నివేదించి భక్తులకు పంచి పెట్టే విధానం అమలు లోకి వచ్చింది. 1843 – 1933 మధ్యకాలంలో తిరుమల క్షేత్ర పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూందీ ప్రసాదాన్ని మనోహరం పేరుతో చలామణి లో వచ్చింది.


1940 లో వివిధ రకాల పరిశీలనల తరువాత తిరుపతికి చెందిన కళ్యాణం అయ్యంగార్ అనే వ్యక్తి వివిధ సుగంధ ద్రవ్యాలతో (ఇప్పటి రూపంలో ఉన్న) లడ్డూలను తయారు చేసే విధానం మొదలైంది. తరువాతి కాలంలో ఆ కళ్యాణం అయ్యంగార్ కి లడ్డూ స్వామి అనే పేరు స్థిర పడింది. వివిధ రాజ వంశాల కాలం నుంచి నాలుగైదు రకాల అన్న ప్రసాదాలు, ప్రత్యేక ఉత్సవాల కోసం తయారు చేసే ప్రసాదాలకు శతాబ్దాల చరిత్రలున్నా ఆ ప్రసాదాలన్నిటిలో స్వామి దర్శనం తరువాత అంతటి ప్రాధాన్యత ను 80 ఏళ్ల క్రితం ప్రవేశ పెట్టిన లడ్డూ ప్రసాదానికి మాత్రమే దక్కింది

ఓం నమో వెంకటేశాయ

Leave a Reply