Cockroach Janata Party | సామాజిక న్యాయమే బహుజన విముక్తి మార్గం

Cockroach Janata Party | సామాజిక న్యాయమే బహుజన విముక్తి మార్గం

Cockroach Janata Party | కాక్రోచ్‌ జనతా పార్టీ దళిత యువకుడి వినూత్న బాణం
రాజకీయ దిశ ఎలా ఉండాలంటే?

Cockroach Janata Party | ఇటీవల “కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)” దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఓ కేసులో నిరుద్యోగులు మీడియా, సోషల్‌ మీడియా, సమాచార హక్కు కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువతను “బొద్దింకలు”, “పరాన్నజీవులు”తో పోల్చడంతో వెబ్‌ పేజీలో సీజేపీ ప్రారంభమైంది. పార్టీ ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ప్రధాన రాజకీయ పార్టీలకంటే ఎక్కువ మంది ఫాలో అయ్యారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల మంది దృష్టిని ఆకర్షించడం ఇన్‌స్టాగ్రామ్‌ చరిత్రలోనే అరుదైన విషయం.

ఇది కేవలం ఒక సోషల్‌ మీడియా ట్రెండ్‌ మాత్రమే కాదు, దేశ యువతలో విస్ఫోటనంలా పేలిన అసంతృప్తి జ్వాలలు. భారత రాజకీయ చరిత్రలో కేవలం సోషల్‌ మీడియా వేదికగా పురుడుపోసుకుని ఇంతటి తీవ్రమైన ప్రజా ఉద్యమంగా మారిన సందర్భం మరొకటి లేదు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నీట్‌ పరీక్ష లీకేజీలు, రూపాయి విలువ పతనం, పెట్రోల్‌-డీజిల్‌ ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ వంటి సంక్షోభాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ అభివృద్ధి సూచికలో మన దేశ ర్యాంక్‌ రోజురోజుకు పతనమవుతోంది. ఈ నేపథ్యంలో కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. వినూత్న ఎజెండాతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసురుతోంది.

ఈ క్రమంలో సీజేపీ వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని, ఆ పార్టీ సృష్టికర్త ఇప్పటికే ఓ రాజకీయ పార్టీలో పనిచేశారని ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలో పనిచేస్తే తప్పేముందనే ప్రశ్న తలెత్తుతోంది. సీజేపీ పార్టీని ఇతర దేశస్తులు ఫాలో చేస్తున్నారని, దాని వెనుక విదేశీ ఫండింగ్‌ ఉందని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదంతా తప్పని ఆ పార్టీ ఎక్స్‌ అకౌంట్‌ నిలిపివేయడంతో అర్థమవుతోంది. ఏది ఏమైనా సంప్రదాయ రాజకీయాలపై విసుగుచెందిన జెన్‌ జీ యువతను ఈ పార్టీ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

కాక్రోచ్‌ జనతా పార్టీ దళిత యువకుడి వినూత్న బాణం

భారతదేశం చారిత్రకంగా కుల పునాదులపై నిర్మితమైన సమాజం. మెజార్టీ రాజకీయ పార్టీలు అగ్రకులాలకు చెందినవే. మరి ఆన్‌లైన్‌ వేదికగా ప్రారంభమైన కాక్రోచ్‌ జనతా పార్టీని దళిత సామాజిక వర్గానికి చెందిన అభిజిత్‌ దీప్కే ప్రారంభించడం గొప్ప విషయం. మహారాష్ట్రలో జన్మించిన అభిజిత్‌ దీప్కే తండ్రి భగవాన్‌ దీప్కే, తల్లి అనితా దీప్కే. అణగారిన వర్గానికి చెందిన ఈ యువకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయడం చరిత్రగానే చెప్పవచ్చు.

అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన ఈ పార్టీ వాస్తవ రాజకీయాల్లో రాణించగలదా? దాని ఎజెండా నేటి కుల భారతాన్ని ఎదుర్కొని రాజకీయ అరంగేట్రం చేయగలదా? ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేక సోషల్‌ మీడియా అలజడిగా మిగిలిపోతుందా? లేక నిజంగా కులాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ బహుజనుల పక్షాన నిలబడి బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారంలోకి తీసుకువస్తుందా? అనేది కూడా మేధావుల ప్రశ్న.

చరిత్రలో అన్నా హజారే ఉద్యమం అవినీతి వ్యతిరేక పోరాటంగా ప్రారంభమై, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ రూపంలో ఒక జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. కానీ సామాజిక సమానత్వాన్ని తీసుకురాలేకపోయింది. ఎందుకంటే అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం ఓ అగ్రకుల నాయకుడు కాబట్టి సమానత్వం సాధ్యమయ్యే అవకాశం లేదు. ఆనాడు ఓ అగ్రకుల రాజకీయ పార్టీని దించి, మరో అగ్రకుల పార్టీని గద్దెనెక్కించడంలో సఫలమయ్యాడు. మరి సీజేపీ అగ్రవర్ణ పార్టీల చేతిలోకి పోతే మరో చారిత్రక తప్పిదం అవుతుంది.

రాజకీయ దిశ ఎలా ఉండాలంటే?

చారిత్రకంగా అసమానతలను ప్రశ్నిస్తూ సమానత్వం కోసం పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే, అంబేడ్కర్‌. వీరు వేల సంవత్సరాలుగా పేరుకుపోయిన కులవ్యవస్థ పునాదులను పెకిలించారు. వారి ఆలోచనలనే రాజకీయ శక్తిగా మలిచిన వ్యక్తి బహుజన నేత కాన్షీరామ్‌. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతతో ఆధిపత్య రాజకీయాలను సవాలు చేశారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూలే-అంబేడ్కర్‌-కాన్షీరామ్‌ వారసత్వ ఆలోచనతో డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ “ఎవరి కులం ఎంతో వారికంత వాటా” అనే నినాదంతో సరికొత్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. రాజ్యాంగ మూల సూత్రం కూడా ఇదే చెబుతోంది. శివుడు, బసవేశ్వరుడి సమానత్వం కూడా ఇదే బోధిస్తుంది. జనాభాలో మెజారిటీగా ఉన్న బహుజనులు ఇంకా అధికారంలో, సంపదలో, అవకాశాల్లో వెనుకబడి ఉన్నారు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన ఈ సామాజిక వాస్తవాన్ని బయటపెట్టింది. దేశవ్యాప్తంగా జరగబోయే కులగణన కూడా ఈ వాస్తవాలను బయటపెట్టబోతోంది. “జనాభాలో మా కులమెంత? అధికారంలో మేమెంత?” అనే ప్రశ్న దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారబోతోంది. కావున ఇదే నేటి కాక్రోచ్‌ జనతా పార్టీకి రాజకీయ దిశ కావాలి.

సామాజిక న్యాయమే బహుజన విముక్తి మార్గం

ఏ దేశంలోనైనా కేవలం సోషల్‌ మీడియా ప్రచారం రాజ్యాన్ని నిర్మించకపోవచ్చు. కానీ నిర్మించడానికి తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అట్టడుగు వర్గాల పక్షాన నిలబడి, రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని నిర్మించగలిగితేనే ఏ ఉద్యమమైనా చరిత్రలో నిలుస్తుంది. ఆ దిశగా సీజేపీ ముందుకు వెళ్లాలి. భూమి పంపిణీ, విద్య, ఉద్యోగాలు, ప్రాతినిధ్యం, సంపదలో వాటా, సామాజిక న్యాయం వంటి అంశాలపై స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. పూలే, అంబేడ్కర్‌, కాన్షీరామ్‌ చూపిన మార్గంలో నడుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతను నిర్మించాలి.

ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం.. “సమ సమాజం, సమానత్వం” అనే మాట ఎవరైనా అగ్రకుల నాయకుడి నోట వినిపిస్తే అతడు దోపిడీ చేయడానికి బయలుదేరినట్టు అని అర్థం. అదే మాట బహుజన నాయకుడి నోట వినిపిస్తే దోపిడీ వర్గాలపై యుద్ధానికి బయలుదేరిన యోధుడు అని అర్థం. ఈ సందర్భంగా కాక్రోచ్‌ జనతా పార్టీ స్థాపించిన దళిత యువకుడు అభిజిత్‌ దీప్కేని యోధుడిగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ పార్టీ సంపూర్ణ రాజకీయ శక్తిగా ఎదిగి బహుజన విముక్తికి తోడ్పడాలని దేశ యువత, మేధావులు ఆశిస్తున్నారు.

– సంపతి రమేష్‌
7989579428

Leave a Reply