మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉంది

మహిళా సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉంది
- ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, ఆంధ్రప్రభ: మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కట్టుబడి పనిచేస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో టీడీపీ ఎప్పటికప్పుడు ముందంజలో నిలిచిందని తెలిపారు.శుక్రవారం ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రతిపక్షాల వైఖరి కారణంగానే పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు పార్టీలో మరింత ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టడం వంటి చారిత్రక నిర్ణయాలు ఎన్టీఆర్ పాలనలోనే జరిగాయని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేశినేని శివనాథ్ అన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్రచార వనరులు లేని కాలంలో కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల శక్తిని చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ నిలిచారని చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని టీడీపీ మహానాడులో అధికారికంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తుందని కేశినేని శివనాథ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు.
ఈసారి మహానాడును క్లస్టర్ విధానంలో నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను మరింత సమన్వయం చేయగలిగామని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలు, రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చలు జరిగాయని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు మహానాడు తీర్మానాలపై రాజకీయ చర్చకు రాకుండా వ్యక్తిగత విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ఆయన విమర్శించారు. లోకేష్ ప్రజల్లో తిరిగి, పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్న నాయకుడని పేర్కొన్నారు.
భవిష్యత్తులో సీఎం చంద్రబాబు తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసే సామర్థ్యం లోకేష్‌కు ఉందని కేశినేని శివనాథ్ అన్నారు. మహానాడు ఘనవిజయాన్ని చూసి ప్రత్యర్థుల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. టీడీపీ తీర్మానాలపై రాజకీయ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
