తప్పిపోయిన మైనర్ బాలిక ఆచూకీ లభ్యం…
సాంకేతిక ఆధారాలతో వరంగల్‌లో గుర్తింపు – కానిస్టేబుళ్లకు నగదు బహుమతి
బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక తన బంధువుల ఇంటి నుంచి అదృశ్యమైన ఘటనలో మైలవరం పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, కొద్ది గంటల్లోనే ఆమెను వరంగల్ ప్రాంతంలో క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందిన వెంటనే మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను నిశితంగా పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలను వినియోగించి, నిఘా బృందాల సమన్వయంతో బాలిక ఆచూకీని గుర్తించారు. అనంతరం వరంగల్ ప్రాంతంలో ఆమెను క్షేమంగా స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ కేసు దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ ప్రదీప్, పీసీ మనోహర్ జి. కొండూరులను మైలవరం ఇన్చార్జి ఏసీపీ రామచంద్రరావు ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతితో సత్కరించారు.
బాలల రక్షణ చట్టం (పోక్సో యాక్ట్) నిబంధనల ప్రకారం బాధిత మైనర్ బాలికకు సంబంధించిన పేరు, చిరునామా, ఫొటోలు లేదా ఇతర గుర్తింపు వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. మీడియా సంస్థలు కూడా బాలిక గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మైనర్ పిల్లల కదలికలపై పర్యవేక్షణ ఉంచడం, అపరిచితులతో పరిచయాల విషయంలో అవగాహన కల్పించడం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని గమనించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు కనిపించకుండా పోయిన సందర్భంలో ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం అందిస్తే త్వరితగతిన చర్యలు తీసుకుని వారిని క్షేమంగా గుర్తించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన పోలీసింగ్‌తో ఇలాంటి సున్నితమైన కేసులను వేగంగా పరిష్కరించేందుకు మైలవరం సర్కిల్ పోలీసులు కట్టుబడి ఉన్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. కిషోర్ బాబు తెలిపారు.
