పిడుగుపాటుకు రైతు మృతి
పిడుగుపాటుకు రైతు మృతి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో శుక్రవారం ఉదయం కురిసిన భారీ గాలివాన ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతు బోయ కృష్ణ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, కృష్ణ తన ఎద్దుల కాడితో కలిసి పొలానికి వెళ్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారి భారీ గాలివాన ప్రారంభమైంది. దీంతో ఆయన సమీపంలోని ఓ చెట్టు కింద ఆశ్రయం పొందేందుకు వెళ్లాడు.
అదే సమయంలో పిడుగు పడటంతో చెట్టు విరిగి కృష్ణపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే కృష్ణ మృతి చెందాడు. రైతు మృతితో ఇబ్రహీంపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బోయ కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
