కీబోర్డు ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు

కీబోర్డు ప్రతిభతో గిన్నిస్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని నంబర్ 2 ఇంక్లైన్ బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు మంతెన భాస్కర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఆయన శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచే కీబోర్డు వాయిద్యంపై ఆసక్తి పెంచుకున్న భాస్కర్, తన ప్రతిభతో ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. గత ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని జొరాస్ట్రియన్ క్లబ్‌లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది కీబోర్డు వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన కొంతమందిని గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు. వారిలో బెల్లంపల్లికి చెందిన మంతెన భాస్కర్ ఎంపిక కావడం విశేషం. గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపికైన భాస్కర్‌కు శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో జరిగిన గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు.
కష్టాల్లోంచి కార్మికుడిగా.. ఆసక్తితో కీబోర్డు ప్లేయర్‌గా
మంతెన భాస్కర్, మంతెన రాజయ్య, పోసమ్మ దంపతుల మూడో సంతానం. ఆయనకు అన్న రమేష్, అక్క రమా, తమ్ముడు సంజీవ్ ఉన్నారు. భాస్కర్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు, 1996లో ఆయన తండ్రి రాజయ్య శాంతిఖని గని ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి తల్లి పోసమ్మ నలుగురు పిల్లలను ధైర్యంగా పెంచారు. భాస్కర్ అన్న రమేష్‌కు తండ్రి ఉద్యోగం వారసత్వంగా వచ్చింది. రమేష్ తన చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లకు తండ్రి స్థానంలో నిలిచి చదివించారు. కుటుంబ బాధ్యతల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు, అవమానాలను దాటుకుంటూ రమేష్ తన తల్లి సహకారంతో కుటుంబాన్ని నడిపించారు. ఈ కష్టాలు, త్యాగాలను చూస్తూ పెరిగిన భాస్కర్ బాగా చదివి, సింగరేణి సంస్థ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం సాధించారు. అదే ఏడాది శాంతిఖని గనిలో ఎలక్ట్రీషియన్‌గా విధుల్లో చేరారు. 2023లో భాస్కర్ సుప్రియను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు లియోనార్డో అనే కుమారుడు ఉన్నాడు.
భాస్కర్‌కు ప్రశంసల వెల్లువ
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన భాస్కర్‌ను కుటుంబ సభ్యులు అభినందించారు. కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.భాస్కర్ పనిచేస్తున్న సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు, శాంతిఖని గని అధికారులు, తోటి కార్మికులు, యూనియన్ నాయకులు, బంధువులు, మిత్రులు ఆయనను ప్రశంసించారు.

