ఏపీ రోడ్లపైకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు

ఏపీ రోడ్లపైకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు
- గుంటూరుకు 100, మంగళగిరికి 50, విజయవాడకు 100 బస్సులు
- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో భారీ ప్రణాళిక
- మౌలిక వసతులపై అధికారులతో పెమ్మసాని సమీక్ష
గుంటూరు, బ్యూరో , ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా రంగంలో భారీ మార్పులకు దారితీసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ బస్సు సేవ పథకం కింద కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ బస్సులను రాష్ట్రానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి & కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ, ట్రాన్స్కో, విద్యుత్ శాఖ అధికారులతో శుక్రవారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని 11 నగరాలకు మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు సమావేశంలో వెల్లడించారు. ఇందులో 12 మీటర్ల పొడవుతో 35+1 సీటింగ్ సామర్థ్యం గల 621 బస్సులు, 9 మీటర్ల పొడవుతో 25+1 సీటింగ్ సామర్థ్యం గల 129 బస్సులు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు తలా 100 బస్సులు కేటాయించగా, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అమరావతి, తిరుపతి, అనంతపురం నగరాలకు తలా 50 బస్సులు మంజూరు చేశారు.
ఈ సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక అమలవుతోందని అధికారులు పేర్కొన్నారు.
బస్సుల నిర్వహణకు అవసరమైన విద్యుత్ లోడ్ సామర్థ్యం, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ట్రాన్స్కో అధికారులు సమావేశంలో సమర్పించారు. అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి, 2026 ఏడాది చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు కింద గుంటూరుకు సంబంధించిన సివిల్ వర్క్స్ కోసం రూ.16.3 కోట్లు, ఎలక్ట్రికల్ పనుల కోసం రూ.11.19 కోట్లు కలిపి మొత్తం రూ.27.49 కోట్లు కేటాయించారు. మంగళగిరికి సంబంధించిన సివిల్ వర్క్స్‌కు రూ.9.24 కోట్లు, ఎలక్ట్రికల్ పనులకు రూ.7.01 కోట్లు కలిపి రూ.16.25 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రజా రవాణా రంగంలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్టులకు ఇది మార్గదర్శకంగా మారుతుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
సమీక్ష సమావేశంలో ఏపీ సీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.వి. రవివర్మ, చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ, గుంటూరు ఏపీసీపీడీసీల్ ఎస్ఈ రమేష్, ఏపీ ట్రాన్స్కో ఎస్ఈ సి.హెచ్.ఎన్. వెంకట్రావు, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ (సీ ఆర్ డీ ఏ ) ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
