farmers | బీజేపీపై తుమ్మల విమర్శల వెల్లువ
farmers | బీజేపీపై తుమ్మల విమర్శల వెల్లువ
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు
farmers | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏమనుకుంటారనే కనీస బాధ్యత, ఇంగిత జ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తమ పాలనలో ఎప్పుడైనా తెలంగాణలో జరిగిన స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందా అని తుమ్మల ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వారికి మద్దతుగా నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షాన పనిచేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం మాత్రమే కాకుండా, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే పూర్తి బాధ్యత కూడా కేంద్రానిదేనని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా ధాన్యాన్ని సేకరించి, అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ విషయంలో బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు మానుకుని వాస్తవాలను గుర్తించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
