క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల మెరుపు దాడులు

క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసుల మెరుపు దాడులు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో అక్రమ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.7.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, మడకశిర యూపీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్.జి. సుబ్రహ్మణ్యం, మడకశిర రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్కుమార్లకు అందిన ఖచ్చితమైన సమాచారంతో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో మంగళవారం రాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ క్రికెట్ బెట్టింగ్, జూదం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు.
ఈ దాడుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆర్. సతీష్ కుమార్ (49), ఎన్. దేవరాజు (44), జబ్బల్ ఇర్ఫాన్ (40), ఎం. సుధీర్ రెడ్డి (40)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై Cr.No.62/2026 కింద 9(1) ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
క్రికెట్ బెట్టింగ్, జూదం, మట్కా, బైక్ రేసింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని డీఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
