కొడుకును చంపి ..
తండ్రి ఆత్మహత్య
అర్ధవీడు, ఆంధ్రప్రభ : మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకును హత్య చేసిన అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల కథనం మేరకు, మిట్టమీదిపల్లె గ్రామానికి చెందిన పఠాన్ సిలార్ (55), సాబీరా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు జావీద్ (28) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. మంగళవారం ఉదయం సాబీరా కూలీ పనికి పొలానికి వెళ్లగా, ఇంట్లో తండ్రి, కొడుకుల మధ్య ఏదో విషయమై ఘర్షణ చోటుచేసుకుంది.
అనంతరం అన్నం తిని ఇంటి బయట నిద్రిస్తున్న జావీద్‌పై తండ్రి సిలార్ క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన సిలార్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి, కొడుకు మృతితో మిట్టమీదిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
