పినరయి విజయన్‌పై ఈడీ సోదాలకు సీపీఎం నిరసన

పినరయి విజయన్‌పై ఈడీ సోదాలకు సీపీఎం నిరసన

మోత్కూర్, ఆంధ్రప్రభ: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇంటిపై ఈడీ సోదాలు బీజేపీ రాజకీయ దాడుల్లో భాగమని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు విమర్శించారు. గురువారం మండలంలోని పాలడుగు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటనర్సు మాట్లాడుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

ఆర్థిక నేరాలకు సంబంధించి సీపీఎం నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) విలువలతో కూడిన నీతివంతమైన పార్టీ అని, ఇతర పార్టీల మాదిరిగా కార్పొరేట్ శక్తుల నుంచి ఎన్నికల బాండ్లు తీసుకోలేదని తెలిపారు.

కేరళలో కాంగ్రెస్ నాయకులపై ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీపీఎం నాయకులను టార్గెట్ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాజకీయ దాడులు చేయిస్తోందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, కార్పొరేట్ చేతుల్లో ఉన్న విద్య, వైద్య రంగాలను తన ఆధీనంలోకి తీసుకుని ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పినరయి విజయన్ ఇంటిపై ఈడీ సోదాలను ప్రజలు, ప్రజాతంత్రవాదులు, లౌకికశక్తులు ఖండించాలని వెంకటనర్సు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, వెండి యాదగిరి, దడిపల్లి సైదులు, గంటెపాక బుచ్చిరాములు, కేశమేని శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply