వర్చువల్ మహానాడులో కదిరి ఎమ్మెల్యే ఉత్సాహం

వర్చువల్ మహానాడులో కదిరి ఎమ్మెల్యే ఉత్సాహం

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు–2026 రెండో రోజు కార్యక్రమాలు కదిరి నియోజకవర్గంలో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వర్చువల్ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కదిరి పట్టణంలోని కోనేరు సమీపంలోని ఎస్‌వీకే ఫంక్షన్ హాల్‌లో క్లస్టర్–5 పరిధిలో, అలాగే రూరల్ మండలంలోని ఇంపీరియల్ గార్డెన్‌లో క్లస్టర్–3 పరిధిలో మహానాడు కార్యక్రమాలు వర్చువల్ విధానంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహానాడు క్లస్టర్ పరిశీలకులు, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగ వంటిదని, ప్రతి కార్యకర్తకు ఇది ఉత్సాహాన్ని నింపే మహోత్సవమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై మహానాడులో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఇంధన పొదుపు మరియు సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించడం అభినందనీయమన్నారు.

అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలే తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకమని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

వర్చువల్ మహానాడులో జాతీయ నాయకుల ప్రసంగాలను భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ల ద్వారా కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పార్టీ అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నాయకులు చేసిన ప్రసంగాలు కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, మహిళా కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు విజయవంతానికి సహకరించారు. మహానాడు సందర్భంగా కదిరి నియోజకవర్గం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడింది.