గొల్లపూడిలో మారుమోగిన ఎన్టీఆర్ నినాదాలు..

గొల్లపూడిలో మారుమోగిన ఎన్టీఆర్ నినాదాలు..
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: తెలుగు భాష, సంస్కృతి, జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటేందుకే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. పేదలకు కూడూ, గుడ్డ, నీడ కల్పించడమే లక్ష్యంగా పార్టీని ప్రారంభించారని తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా పేదలకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఆయన ప్రారంభించిన పింఛన్ పథకం నేడు అనేక రాష్ట్రాల్లో అమలవుతోందన్నారు. ఒక్క రూపాయికే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి విప్లవాత్మక పథకాలను ఎన్టీఆర్ తీసుకొచ్చారని గుర్తు చేశారు.
అన్న ఎన్టీఆర్ ఆశయాలను తూ.చ. తప్పకుండా అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీలు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు అన్నగారి ఆశయాలకు నిదర్శనమన్నారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళా సాధికారతకు బాటలు వేసిందీ అన్నగారేనని కొనియాడారు.
“జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జోహార్ ఎన్టీఆర్” అంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నినదించారు. కార్యకర్తల నినాదాలతో గొల్లపూడి వన్ సెంటర్ పరిసరాలు మారుమోగాయి.
అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ కార్యక్రమం ముగిసింది. గొల్లపూడిలో రెండేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం అమలు చేసిన తల్లికి వందనం, పింఛన్లు, అన్నదాత సుఖీభవ, వాహనమిత్ర పథకాలకు రూ.41.39 కోట్లు చెల్లించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
గొల్లపూడిలో రూ.4.53 కోట్లతో సిమెంట్ కాంక్రీట్ డ్రెయిన్లు నిర్మించామని తెలిపారు. రూ.22.91 లక్షలతో రక్షిత నీటి సరఫరా పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.15.92 కోట్లతో జల జీవన్ పనులు చేపట్టామని, పంచాయతీ రాజ్ నిధుల నుంచి రూ.7.47 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
