ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌కు ఘన నివాళి

  • ఎన్టీఆర్ ఆశయాలే తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకం
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు కాదు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆంధ్రుల ఆరాధ్యదైవం, తెలుగు వాడి తెగువకు, స్వాభిమానానికి చిరునామా అని కొనియాడారు.

ఢిల్లీ పెద్దల ముందు తెలుగు ప్రజల దమ్ము ఏంటో దేశానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వ విఖ్యాతుడు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కారణజన్ముడు అని అన్నారు. సినీ వినీలాకాశంలో రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్… రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారని తెలిపారు. ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఆధునిక సంఘ సంస్కర్తగా ఆయన నిలిచిపోయారని చెప్పారు.

రాజకీయాల్లో ప్రజలే దేవుళ్లు, సమాజ సేవే ధ్యేయం అని నిరూపించిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతమని అన్నారు. పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పాలన వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు స్వీయ గౌరవ నినాదంతో పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టమని అన్నారు.

తెలుగు జాతి గర్వంగా నిలిచేలా చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అన్నా అంటే నేనున్నానంటూ ప్రజలను ఆదుకున్న మహానేత ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. తెలుగు ప్రజల కీర్తిగా, తరతరాలకు నిత్యనూతన స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచిపోతారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేటి తరాలు ఎన్టీఆర్ ఆశయాలను తెలుసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, తెలుగు జాతి గౌరవం కోసం ఆయన చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Leave a Reply