నిరుపయోగంగా బాలికల వసతి గృహం

నిరుపయోగంగా బాలికల వసతి గృహం

పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణ పరిధిలో 1 వ వార్డులో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బాలికల వసతి గృహం ప్రస్తుతం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటోంది. విద్యార్థినుల కోసం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ భవనం నెలల తరబడి ఖాళీగా ఉండటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ వసతి గృహం ప్రారంభ దశలో కొంతకాలం మాత్రమే ఉపయోగించగా, ప్రస్తుతం తలుపులు మూసివేసి నిర్లక్ష్యంగా వదిలేయడం విమర్శలకు దారితీస్తోంది.

వసతి గృహం చుట్టూ పెరిగిన పొదలు, పగిలిన కిటికీలు, తుప్పు పట్టిన గేట్లు అక్కడి దుస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. భవనం లోపల విద్యుత్ సౌకర్యాలు, మంచాలు, నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేక అవి పనికిరాని స్థితికి చేరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని గదుల్లో చెత్త పేరుకుపోవడంతో పాటు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేద కుటుంబాలకు చెందిన బాలికలు విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఈ వసతి గృహం ఎంతో ఉపయోగపడుతుందని భావించినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో అది నెరవేరడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీప గ్రామాల నుంచి చదువుకోడానికి వచ్చే విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఖర్చులతో ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల భద్రత, విద్య కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని తిరిగి ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply