ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్..

ఆత్మగౌవానికి ప్రతీక ఎన్టీఆర్..
చంద్రబాబు నాయకత్వం లో మరింత బలంగా టీడీపీ
మాజీ మంత్రి దేవినేని ఉమా
గొల్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దేవినేని ఉమా
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం అంటే ఏమిటో పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడిగా, కృష్ణుడిగా సినీరంగంలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ ధృవతారగా వెలిగారని పేర్కొన్నారు. కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. సంక్షేమ పథకాల ఆధ్యుడిగా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉమా పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీని కాపాడి 44 ఏళ్లుగా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ విజయానికి చంద్రబాబు కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
‘మీకోసం వస్తున్నా’ పాదయాత్రతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి 2014లో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారని ఉమా వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. మహిళలను అవమానించిన వైసీపీ నేతలకు ప్రజలే గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా మూడో తరం నాయకత్వాన్ని నిరూపించుకున్నారని ఉమా తెలిపారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు సాగుతోందని వెల్లడించారు.
నందమూరి బాలకృష్ణ హిందూపురంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, బ్లడ్ బ్యాంక్, సంజీవని వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ , చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్ సమన్వయంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందని దేవినేని ఉమా పేర్కొన్నారు.
