పోరంకిలో ఎన్టీఆర్ కు నివాళులు…

పెనమలూరు, ఆంధ్రప్రభ : మహానాడు సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్, నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,మహిళా నేతలు, యువతకు మహానాడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ…“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు”అనే మహోన్నత ఆశయంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుండగా, నారా లోకేష్ యువశక్తి, కార్యదీక్షతో యువతకు కొత్త అవకాశాలు సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా, పార్టీ ఆవిర్భావ స్ఫూర్తిని గుర్తు చేసుకునే వేడుక అని, కార్యకర్తల త్యాగాలు – నాయకుల సేవలను స్మరించుకునే మహోత్సవమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలేనని, ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముకలాంటివారని కొనియాడారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని,ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి – సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,మహిళా నాయకులు,అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
