80వ సారి రక్తదానం చేసిన విజయ్

80వ సారి రక్తదానం చేసిన విజయ్

అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న అవనిగడ్డ వాసి కస్తూరి విజయ్ కుమార్

చల్లపల్లి, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గంలో రక్తదానానికి ప్రతీకగా నిలిచిన కస్తూరి విజయ్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే 80వ సారి రక్తదానం చేసి అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన, అవసరంలో ఉన్న వారి కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

తాజాగా విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రత్నకుమారి అనే మహిళకు ప్లేట్లెట్లు ప్రమాదకర స్థాయిలో 6000కు పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు “మన అవనిగడ్డ బ్లడ్ డోనార్స్” గ్రూప్ నిర్వాహకులను సంప్రదించగా, సమాచారం అందుకున్న వెంటనే కస్తూరి విజయ్ కుమార్ స్పందించారు.

తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా వెంటనే విజయవాడకు చేరుకుని ప్లేట్లెట్లు దానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తించారు. సేవ అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలనే విషయాన్ని ఆయన మరోసారి నిరూపించారు.

ఈ సందర్భంగా కస్తూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, తన తండ్రి ఆశీస్సులతో 80వ సారి ప్లేట్లెట్లు దానం చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి బొట్టు ఒక ప్రాణానికి ఆశగా మారాలని, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం కంటే గొప్ప సేవ లేదని అన్నారు.

సమాజంలో అనేక మంది యువతకు ఆయన నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రక్తదానం అంటే ప్రాణదానం అనే నమ్మకంతో ప్రతి అవసర సమయంలో ముందుకొస్తున్న ఆయన సేవాభావం ప్రశంసనీయం. ఆయన వంటి వ్యక్తులు ఉన్నంతకాలం మానవత్వం చిరస్థాయిగా నిలుస్తుందని స్థానికులు పేర్కొన్నారు.