రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం..

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం..

మహానాడు కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది

ఆముదాలవలస, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు.

మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అన్ని క్లస్టర్లలో జరుగుతున్న ఏర్పాట్లు, కార్యకలాపాలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయాన్ని స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, మహానాడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అన్ని మండలాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తాయని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. 44 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని తెలిపారు.

రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసిన నాయకత్వం తెలుగుదేశం పార్టీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహానాడు ద్వారా పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తోందని చెప్పారు.

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ ఇన్‌చార్జులు, క్లస్టర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మహిళా నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.