తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనాలి.. రైతులు అధైర్యపడొద్దు

తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనాలి.. రైతులు అధైర్యపడొద్దు
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, ఆంధ్రప్రభ:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వడ్లు తడిసిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం భారీ వర్షాలకు ధ్వంసమైన పొనకల్ గ్రామ సమీపంలోని ఎస్.కె. ఫంక్షన్ హాల్‌ను పరిశీలించి, యజమాని ఎస్‌కే బాషారత్‌ను పరామర్శించారు. తర్వాత మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో ఫోన్‌లో మాట్లాడి కోరారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని సూచించారు. తమ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, సెర్ప్ ఏపీఓ లలిత కుమారి, ఇన్‌చార్జి మండల వ్యవసాయ శాఖాధికారి గొర్ల అంజిత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసిహుల్ల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్, టౌన్ అధ్యక్షుడు ఎం. రాజేష్, నాయకులు ఎం. సతీష్, ఎం. రాజన్న, రియాజొద్దీన్, భూమేష్ గుప్తా, డి. రమేష్ పాల్గొన్నారు.
