SIR | సరిహద్దు గ్రామాల్లో ససేమిరా..!
- సరిహద్దు వివాదం తేల్చాకే ఎస్‌ఐఆర్..
- 12 గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిలిపివేత
- ముందు సరిహద్దు వివాదం పరిష్కరించండి..
- తర్వాతే సర్వేలో పాల్గొంటామని గ్రామస్తుల డిమాండ్
ఆంధ్రప్రభ, ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు గ్రామస్తులు బ్రేక్ వేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరదోలి సహా పలు గ్రామాల్లో ఎస్‌ఐఆర్ సర్వే కోసం వెళ్లిన అధికారులను గ్రామస్తులు నిలువరించి, నమోదు ఫారాలను స్వీకరించేందుకు నిరాకరించారు. ముందుగా దశాబ్దాలుగా కొనసాగుతున్న తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని, ఆ తర్వాతే సర్వేలో పాల్గొంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో ఉన్న కెరమెరి మండలంలోని 12 గ్రామాలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టడంతో ఈ గ్రామాలు ఏదో ఒక రాష్ట్ర పరిధిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు తాము రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అయితే ఎస్‌ఐఆర్ పూర్తయితే ఒకే రాష్ట్ర పరిధిలో ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ముందుగా తమ భూములకు పట్టాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుందో, తమ గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసిఫాబాద్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాల కలెక్టర్లు కలిసి సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని, భూముల యాజమాన్యంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. తమ హక్కులను కాపాడే ప్రభుత్వ పరిధిలోనే కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన తర్వాతే ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొంటామని తేల్చిచెప్పారు.
గ్రామస్తుల నిరసనతో పరదోలి సహా పలు సరిహద్దు గ్రామాల్లో ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు.
