వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది

వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది
- బండి సంజయ్
కరీంనగర్, ఆంధ్రప్రభ:
రాష్ట్రంలో రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
బుధవారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తలో మాట చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.
తడిసిన ధాన్యం పేరుతో పెద్ద ఎత్తున కోతలు విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడిందని, పంట నష్టపోతే పరిహారం అందించే పరిస్థితి కూడా లేదన్నారు.
పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులకు ఇంకేం మేలు చేస్తారని ప్రశ్నించారు. నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వడ్ల కొనుగోలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నప్పుడు కొనుగోళ్లలో ఎందుకు జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను నిర్వహించలేకపోతే అదే విషయాన్ని కేంద్రానికి లేఖ ద్వారా తెలియజేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విధ్వంసకర రాజకీయాల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విధ్వంసం ద్వారా డబ్బులు వసూలు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

