Telangana | భక్తజన సందోహంతో పులకించిన పుష్కర క్షేత్రం

Telangana | భక్తజన సందోహంతో పులకించిన పుష్కర క్షేత్రం
Telangana | రెండో రోజు తరలివచ్చిన భక్తులు
త్రివేణి సంగమంలో పవిత్ర పుష్కర స్నానాలు
శంభో శంకర నినాదాలతో మారుమోగిన కాళేశ్వరం
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక శోభ
Telangana | మహాదేవపూర్ , ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్యపుష్కరాలు శుక్రవారం రెండో రోజు మరింత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు కాళేశ్వర క్షేత్రానికి తరలివచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల సంగమ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది.

“హర హర మహాదేవ”, “శంభో శంకర” నినాదాలతో త్రివేణి సంగమం, ఆలయ ప్రాంగణం మారుమోగిపోయాయి. భక్తుల భజనలు, శివనామస్మరణతో కాళేశ్వరం క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుష్కరాల రెండో రోజు కావడంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పుష్కర స్నానాలు ఆచరించారు. పలువురు భక్తులు పితృదేవతలకు తర్పణాలు సమర్పించి పుణ్యఫలాలు పొందారు.

ఇక ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, హోమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. పుష్కర ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి భక్తులను క్రమబద్ధంగా దర్శనాలకు పంపించారు.
గురువారం రాత్రి వేళ త్రివేణి సంగమం వద్ద హారతులు, దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్కర క్షేత్రం మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుండగా, భక్తుల రాకతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

















CLICK HERE TO READ 21stMaychintana | అహంకారం విడిచిన కుబేరుడికి శివుని ఉపదేశం
