తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్‌లో మహానాడు వేడుకలు

తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్‌లో మహానాడు వేడుకలు
టీడీపీ జెండా ఆవిష్కరించిన డా. డాలర్స్ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు
తిరుపతి టౌన్, ఆంధ్రప్రభ : తిరుపతి పార్లమెంట్ 5వ క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక వార్షిక వేడుక మహానాడు కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగువారి ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ పేదల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు.
పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని నూతన కార్యవర్గంతో పార్టీ మరింత ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 5వ క్లస్టర్ ఇన్‌ఛార్జులు, వివిధ విభాగాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
