Smart Meters | జీడిమెట్ల పైలట్ ప్రాజెక్ట్‌తో మొదలైన స్మార్ట్ మీటర్లు

Smart Meters | జీడిమెట్ల పైలట్ ప్రాజెక్ట్‌తో మొదలైన స్మార్ట్ మీటర్లు

Smart Meters | ఆర్డీఎస్ఎస్‌పై అధికార – విపక్షాల మధ్య మాటల యుద్ధం
ట్రై పార్టీ ఒప్పందంతో స్మార్ట్ మీటర్ల చర్చ
వ్యవసాయ మోటర్లకు మీటర్లపై పెరుగుతున్న ఆందోళనలు

Smart Meters | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర మంత్రిమండలిలో విద్యుత్ శాఖపై తీసుకున్న తాజా నిర్ణయం అధికార – విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకే రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరుతున్నారంటూ బీఆర్ఎస్ విమర్శలకు దిగుతుండగా.. కేంద్ర ప్రభుత్వంతో ట్రై పార్టీ ఒప్పందం చేసుకున్నది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ అధికార పక్షం ప్రతి విమర్శలు చేస్తోంది.

గత ప్రభుత్వం సంతకం చేయడం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే స్మార్ట్ మీటర్ల ప్రస్తావన రానే రాదంటూ స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఆర్డీఎస్ఎస్‌లో చేరితే స్మార్ట్ మీటర్లు బిగించక తప్పదనీ, గృహ వినియోగదారులతో పాటు వ్యవసాయ పంపు సెట్లకూ తప్పనిసరిగా బిగించాల్సిందేనంటూ విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

పైలట్‌తోనే నిలిచిన స్మార్ట్

వాస్తవానికి పదేళ్ల క్రితమే ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకంలో భాగంగా 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లు ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాయి.

దీని ప్రకారం ప్రభుత్వం రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో చేరడం ద్వారా విద్యుత్ సంస్థల్లో ఎదురయ్యే నష్టాలను నివారించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో పైలట్ ప్రాజెక్టును జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఎస్పీడీసీఎల్ నిర్వహించి సుమారు 8,800 గృహ వినియోగదారులతో పాటు 44 – 11 కేవీ ఫీడర్ల పరిధిలో మొత్తం 12 వేల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించారు.

అదే సమయంలో ఎస్పీడీసీఎల్‌లో 23 వేల ప్రభుత్వ కార్యాలయాలలో 15 వేలకు పైగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో 20 వేలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలలో 16 వేలకు పైగా స్మార్ట్ మీటర్లను అమర్చారు. జీడిమెట్ల పైలట్ ప్రాజెక్టు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చాల్సి ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ జరుగుతోందనే విమర్శలు రావడంతో ఈ ప్రాజెక్ట్ జీడిమెట్లతోనే ఆగిపోయింది.

ఆర్డీఎస్ఎస్‌లో చేరితే స్మార్ట్ తప్పనిసరి

వాస్తవానికి ట్రై పార్టీ అగ్రిమెంట్‌లో భాగంగా ఆర్డీఎస్ఎస్‌లో చేరినట్టయితే, రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగించడం తప్పనిసరి అని తేలిపోయింది. అందుకు అంగీకరించని నాటి ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్‌లో చేరకపోగా, పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది.

విద్యుత్ రంగంలో నష్టాలను తగ్గించడానికే ఆర్డీఎస్ఎస్‌లో చేరేందుకు అంగీకరించామనీ స్పష్టం చేసింది. కానీ స్మార్ట్ మీటర్లు దశలవారీగా అమలు చేయడం అన్నది తప్పనిసరి అని ట్రై పార్టీ అగ్రిమెంట్‌లో ఉంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 10 వేలు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 5 వేలకు ప్రభుత్వ కార్యాలయాలలో స్మార్ట్ మీటర్లు బిగించనున్నారు. ఈ ప్రక్రియ ముగియగానే వ్యవసాయ వినియోగదారులకు మినహాయించి గృహ, వ్యాపార వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు అమర్చనున్నారు. అనంతరం ప్రతి డీటీఆర్, ప్రతి ఫీడర్ వద్ద ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.

క్రమేపీ 500 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వినియోగదారులకు, ఆ తర్వాత 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారికి వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండో దశలో వ్యవసాయ పంపు సెట్లకు కూడా మీటర్లు బిగిస్తారని మేధావులు, సామాజిక కార్యకర్తలు, విద్యుత్ రంగ నిపుణుల అనుమానం. అది కాస్తా విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు దారి తీస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Leave a Reply