ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. గోదాముల కొరతతో జాప్యం
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. గోదాముల కొరతతో జాప్యం
- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష
చౌటుప్పల్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాదాద్రి, నల్లగొండ జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రస్తుత స్థితి, కల్లాల్లో నిల్వలు, హమాలీలు, లారీలు, నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మునుగోడు, చండూరు, ఘట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో గత సంవత్సరం 2,85,560 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 4,20,430 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3,52,300 క్వింటాళ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని, ఇంకా 68,130 క్వింటాళ్ల ధాన్యం కల్లాల్లో నిల్వ ఉందని వివరించారు.
యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి రెట్టింపు అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2,36,215 క్వింటాళ్లు సేకరించగా, ఇంకా కొనుగోళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే అనుకున్నదానికంటే అధిక దిగుబడి రావడం, హమాలీలు, లారీల కొరత, కొన్ని మిల్లులు బ్లాక్‌లిస్టులో ఉండడం, అలాగే నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యలను తాత్కాలికంగా మాత్రమే కాకుండా శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
