​స్వచ్ఛమైన తాగునీరు అందించడమే దివీస్ సంస్థ లక్ష్యం

  • మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ ముఖ్య లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ, 13వ వార్డులలో దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ యాజమాన్యం సుమారు రూ. 12,70,000/- (పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయల) ఆర్థిక సహాయంతో పునరుద్ధరించిన రెండు ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు దేప రమ్య రాజు, బత్తుల వాణి విప్లవ్ లతో కలిసి ఆమె ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచి నీరు అందించడంలో దివీస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)గా భావించి, మూతపడిన, పాడైన నీటి ప్లాంట్లను లక్షలు వెచ్చించి పునరుద్ధరించి, తిరిగి ప్రజల చెంతకు చేర్చినందుకు దివీస్ యాజమాన్యానికి ఆమె మున్సిపాలిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు పాక చిరంజీవి, కో ఆప్షన్ మెంబర్ పస్తం గంగారాములు, నాయకులు ఊడుగు రమేష్ గౌడ్, చింతల సాయిలు, దివీస్ సంస్థ ప్రతినిధులు బి. గోపి, జె. శివకృష్ణ తో పాటు మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.