కనకదుర్గ ఆలయంలో వైద్య సదుపాయాలపై కలెక్టర్ సమీక్ష

కనకదుర్గ ఆలయంలో వైద్య సదుపాయాలపై కలెక్టర్ సమీక్ష

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రతిరోజు నిర్వహించే పంచహారతుల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ కలెక్టర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

అనంతరం కలెక్టర్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు అందుతున్న వైద్య సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగుల వివరాల రిజిస్టర్‌ను పరిశీలించి, అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈవో శీనా నాయక్‌ను ఆదేశించారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఇతర ధర్మకర్తల మండలి సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. మహామండపం వైపు నుంచి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా పలు సూచనలు చేశారు.