కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం…

కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం…
- హట్టహాసంగా 5వ రోజు సరస్వతి అంత్య పుష్కరం
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : “కాళేశ్వర నివాసోవా… కాళేశ్వర నీరిక్షణం… కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వేలాది మంది భక్తులతో శ్రీ కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక మహాసాగరంలా మారింది. పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాల ఐదవ రోజు త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసిపోయింది. గోదావరి – ప్రాణహిత – అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

హరహర మహాదేవ… జై కాళేశ్వర… ఓం నమఃశివాయ నినాదాలతో త్రివేణి తీరం మారుమోగింది. అంతర్వాహినిగా ప్రవహించే పవిత్ర సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పుణీతులై పితృ తర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించి పితృదేవతలకు నివాళులు అర్పించారు. నదీ తీరమంతా భక్తి భావనతో నిండిపోగా, ఆలయ ప్రాంగణం శివనామ స్మరణలతో దివ్యక్షేత్రంలా కనిపించింది.

సువిశాలంగా విస్తరించిన త్రివేణి సంగమంలో ఏర్పాటుచేసిన పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో ఐదవ రోజు స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. భక్తులు దానధర్మాలు నిర్వహిస్తూ పుష్కర మహిమను చాటిచెప్పారు.

పుష్కర నదికి సంబంధించిన తొలి పన్నెండు రోజులలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ రోజు ఆచరించే దానాలు, సేవలు అనేక పుణ్యఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం. ప్రకృతి పరిరక్షణ, నదీ సంస్కృతి, హైందవ సంప్రదాయాల పరిరక్షణకు పుష్కరాలు ప్రతీకగా నిలుస్తాయని పండితులు వివరిస్తున్నారు. నదీ తీరంలో దానం చేయడం ద్వారా మానవతా భావం పెంపొందుతుందని పురాణోక్తి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు. భక్తులు నదిలో లోతుగా వెళ్లకుండా ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ప్రత్యేక బోట్లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. వైద్య శిబిరాలు, తాగునీరు, అన్నదాన కేంద్రాలు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

మరోవైపు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగాయి. ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో నది తీరాన ఆదివారం రాత్రి నిర్వహించిన నవరత్నమాల హారతులు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. అగ్నిజ్వాలల కాంతుల్లో త్రివేణి సంగమం దివ్యరూపాన్ని సంతరించుకుంది.

సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, శైవ నృత్య రూపకాలు, హరికథలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మధురంగా మార్చాయి.
కాళేశ్వరం క్షేత్రం మొత్తంగా ఒక మహా యజ్ఞవేదికలా మారగా…
త్రివేణి తీరం భక్తి గంగగా ప్రవహిస్తుండగా…
సరస్వతి అంత్య పుష్కరాలు భక్తుల హృదయాల్లో చిరస్మరణీయ ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తున్నాయి.
