అధికారం కోసమే ప్రజలను రెచ్చగొడుతున్న జగన్

అధికారం కోసమే ప్రజలను రెచ్చగొడుతున్న జగన్

ధూళిపాళ్ల నరేంద్ర

పొన్నూరు, ఆంధ్రప్రభ: అధికారం కోసమే వైసీపీ అధినేత వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని, గత ఐదేళ్ల పాలనలో అరాచకాలు సాగించిన వైసీపీ నాయకులు ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పొన్నూరులో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మొక్కజొన్నల అంశాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని, జగన్ ప్రోత్సాహంతో వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు.

ధూళిపాళ్ల కుటుంబం గత 50 ఏళ్లుగా రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు. 1977 నుంచి సంగం డెయిరీ పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. “మాకు రాజకీయం అంటే ప్రజాసేవ. ప్రతి వర్గానికి న్యాయం చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో అశాంతి సృష్టించారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాల కారణంగానే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు.

రైతుల పేరుతో దొంగ దీక్షలు, దొంగ ధర్నాలు చేయడం వైసీపీకి అలవాటైందని ధూళిపాళ్ల విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలు కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందన్నారు. వైసీపీ హయాంలో వరిని రూ.1200కు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం రూ.1750కు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

2010 నుంచి సంగం డెయిరీ తరఫున రైతుల వద్ద నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నామని, డెయిరీ లాభాలను రైతులకే పంచుతున్నామని చెప్పారు. సంగం డెయిరీ ద్వారా మొక్కజొన్నలను రూ.2100కు కొనుగోలు చేస్తే తనను దళారీగా ముద్ర వేయడం దురదృష్టకరమన్నారు.

మామిళ్లపల్లి గోదాములోని మొక్కజొన్నల అంశంపై మాట్లాడుతూ, 31 ఎకరాల పంట అని చెబుతున్న వారిలో 17 ఎకరాలకు మాత్రమే రికార్డులు ఉన్నాయని తెలిపారు. అధికారులు పూర్తి వివరాలు, డిపాజిట్ కోరితే తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.

వైసీపీ హయాంలో సంగం డెయిరీపై ఎన్నో కేసులు పెట్టినా ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. “కేసులకు భయపడటం మా రక్తంలో లేదు. ఎన్ని కుట్రలు చేసినా సంగం డెయిరీని తాకలేరు” అని స్పష్టం చేశారు.

జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, “జగన్ తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీ అధికారంలోకి రాదు” అని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రేమాభిమానాలే తమకు ఆశీర్వాదాలని, అసత్య ప్రచారాలను భవిష్యత్తులోనూ తిప్పికొడతామని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

Leave a Reply