Robotic surgery Hyderabad | చైనా నుంచి హైదరాబాద్ రోగికి రోబోటిక్ శస్త్రచికిత్స

Robotic surgery Hyderabad | చైనా నుంచి హైదరాబాద్ రోగికి రోబోటిక్ శస్త్రచికిత్స
Robotic surgery Hyderabad | 5జీ టెక్నాలజీతో 90 నిమిషాల్లో విజయవంతమైన ఆపరేషన్
టెలీ-రోబోటిక్ సర్జరీతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
దూర ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవల ఆశలు
భారతీయ వైద్యుడి అరుదైన విజయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
Robotic surgery Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైద్యం కోసం విదేశాల నుంచి రోగులు హైదరాబాద్‌కు వచ్చే సంప్రదాయానికి గుడ్‌బై చెప్పి, ఏకంగా వైద్యుడు చైనాలో కూర్చొని హైదరాబాద్లో ఉన్న రోగికి రోబోటిక్ శస్త్రచికిత్స నిర్వహించారు. భారత్కు చెందిన యూరాలజిస్ట్ మహమ్మద్ గౌస్ అరుదైన శస్త్రచికిత్స చేసి భేష్ అనిపించుకున్నారు.
చైనాలోని వుహాన్ (4,000 కిలోమీటర్ల దూరం)లో డాక్టర్ కూర్చొని, హైదరాబాద్లో ఉన్న రోగికి రోబోటిక్స్ సాయంతో బ్లాడర్ రీ-కనెక్షన్ ఆపరేషన్ పూర్తి చేశారు. 5జీ నెట్‌వర్క్ సాయంతో శరవేగంగా సూచనలు ఇస్తూ, కేవలం 90 నిమిషాల్లోనే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
వైద్య రంగంలో సాంకేతిక విప్లవానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన ప్రపంచ వైద్య సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టెలీమెడిసిన్, 5జీ కమ్యూనికేషన్, కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో ఈ ఘటన చూపిస్తోంది.
భారతీయ మూలాలున్న యూరాలజిస్టు డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆయన చైనాలోని తొంగ్లీ జీ ఆసుపత్రిలో ఉండగా, హైదరాబాద్లోని రోగికి యూరెటర్ రీఇంప్లాంటేషన్ అనే క్లిష్టమైన శస్త్రచికిత్సను రోబోటిక్ వ్యవస్థ ద్వారా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో చైనా అభివృద్ధి చేసిన రోబోటిక్ సర్జరీ పరికరాలు, అల్ట్రా ఫాస్ట్ 5జీ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషించాయి.
ఈ శస్త్రచికిత్స కేవలం సాంకేతిక ప్రదర్శన మాత్రమే కాదు. భవిష్యత్తు వైద్య వ్యవస్థ ఎలా ఉండబోతోందో చూపించిన ప్రత్యక్ష ఉదాహరణగా నిపుణులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిపుణుల కొరత, అత్యవసర శస్త్రచికిత్సలలో ఆలస్యం, దూర ప్రాంత రోగులకు మెరుగైన వైద్యం అందకపోవడం వంటి సమస్యలకు టెలీ-రోబోటిక్ సర్జరీలు పరిష్కారమవుతాయని విశ్లేషిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రిమోట్ సర్జరీలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ, భారత్కు సంబంధించి ఇది అత్యంత ప్రాధాన్యత పొందిన ఘటనగా మారింది. గతంలో గురుగ్రామ్‌లో ఉన్న వైద్యుడు హైదరాబాద్లోని చిన్నారికి రోబోటిక్ సర్జరీ నిర్వహించిన ఘటన కూడా వైద్యరంగంలో చర్చనీయాంశమైంది.
